చాలా మంది భోజనం చేసిన తరువాత రిలాక్స్ అవ్వాలని చూస్తారు. కొందరైతే ఓ కునుకు కూడా తీస్తారు. ఇలా కునుకు తీయడం వల్ల మానసికంగా రిఫ్రెష్ అవుతారు. కానీ తిన్న ఆహారం కొవ్వులా పేరుకుపోయి పొట్ట చుట్టూ చేరుతుంది. శారీరక శ్రమ చేసేవారికి ఈ సమస్య ఉండకపోవచ్చు. కానీ అలా చేయలేని వారిలో ఇది ప్రధాన సమస్యగా మారుతుంది. అందువల్ల భోజనం చేసిన తరువాత కాస్త అటూ ఇటూ నడవాలని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అయితే ఇది కూడా సాధ్యం కాని వాళ్లు ఇతర జీర్ణక్రియను జరిపే పదార్థాలను తినాలని సూచిస్తున్నారు. ఆహారం తిన్న తరువాత జీర్ణ వ్యవస్థను సక్రమంగా పనిచేసే విధంగా తోడ్పడే పదార్థాల్లో సోంపు ఒకటి.
సోంపు వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలిసిన వారు దానిని అస్సలు విడిచిపెట్టరు. భోజనం తిన్న వెంటనే చాలా మంది దీనిని నోట్లో వేసుకుంటారు. రెస్టారెంట్లలో, శుభకార్యాల్లో సోంపును కూడా ఆహారంలో భాగంగా చేర్చుతారు. కానీ చాలా మంది దీనిని పట్టించుకోరు. కొందరికి సోంపు తిడం అస్సలు నచ్చదు. కాస్త చేదుగా ఉండడం వల్ల దీని జోలికి పోరు. కానీ ఆ రుచిని పోగొట్టేందుకు చక్కెర బిళ్లలు వేస్తుంటారు. ఇంతకీ సోంపు తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

సోంపు తినడం వల్ల శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగిస్తుంది. అలా కొవ్వు కరిగి బరువు తగ్గుతారు. కేవలం బరువు తగ్గడమే కాకుండా ఇతర ఆరోగ్య ప్రయోజనాలు కూడా అధికంగా ఉంటాయి. ఇక భోజనం చేసిన తరువాత ఒక టేబుల్ స్పూన్ సోంపును నోట్లో వేసుకోవడం ద్వారా లాలాజలం ఉత్పత్తి అయి అసిడిటీ సమస్యను తగ్గిస్తుంది. సోంపులో ఉండే ఫైబర్ మలబద్ధకం సమస్యను తగ్గిస్తుంది. రక్తహీనతతో బాధపడేవారు సోంపు తీసుకోవడం ద్వారా ఎర్ర రక్తకణాలు పెరుగుతాయి.
అయితే సోంపును నేరుగా తీసుకోకుండా వేయించి తీసుకోవడం వల్ల కాస్త రుచిగా ఉంటుంది. అంతేకాకుండా ఇందులో చక్కెర బిళ్లలు వేసుకొని తినొచ్చు. అలాగే సోంపును వేయించి పొడిగా తయారు చేసుకోవాలి. ఈ పొడిని నిల్వ చేసుకొని గోరువెచ్చని నీటిలో తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల శరీరంలోని కొవ్వు కరిగిపోతుంది. ఇవే కాకుండా అజీర్తి, అసిడిటీ సమస్యలు తగ్గడమే కాకుండా ఆరోగ్యంగా ఉంచుతుంది.