కొందరు మొహం నుంచి కింది వరకు ఎంతో అందంగా ఉంటారు. కానీ పాదాలు మాత్రం పగుళ్లు ఏర్పడుతాయి. అధిక వేడి, ఎక్కువ సేపు నిలబడడం, కటిక నేలపై నడవడం వల్ల పాదాలు పగుళ్లు ఏర్పడుతాయి. ఆ తరువాత వాటి నుంచి రక్తం కూడా వస్తుంది. ఈ బాధ పోవడానికి కొందరు వైద్యులను సంప్రదించడం మంచిదే. కానీ అంతకుముందు కొన్ని చిట్కాలను పాటించి చూడండి.. అయినా తగ్గకపోతే అప్పుడు వెళ్లండి. ఆ చిట్కాలేంటో ఒకసారి చూద్దాం.
ఒక గిన్నెలో రాళ్ల ఉప్పు, నిమ్మరసం, గ్లిసరిన్, రోజ్ వాటర్ వేసి కలపాలి. కాసేపు ఆగిన తరువాత పాదాలను అందులో ఉంచాలి. ఇలా చేయడం వల్ల పాదాలపై ఉన్న మృత కణాలు తొలిగిపోతాయి. ఇలాగే కాకుండా ఒక గిన్నెలో నిమ్మరసం, రోజ్ వాటర్ గ్లిసరిన్ వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని శుభ్రం చేసిన పాదాలపై రాయాలి. ఇలా వారానికి రెండు లేదా మూడు సార్లు చేయాలి. ఇలా చేయడం వల్ల కూడా పాదాలు మృదువుగా మారుతాయి.

పొడి చర్మం ఎక్కువగా ఉన్నవారిలో పాదాలు పగుళ్లు ఏర్పడుతాయి. వీరు రాత్రి పడుకునే ముందు పాదాలకు నువ్వుల నూనెతో లేదా కొబ్బరి నూనెతో మర్దన చేయాలి. ఇలా ప్రతిరోజూ చేయడం వల్ల మంచి ఫలితాన్ని పొందవచ్చు. పాదాలు పగిలిన ప్రదేశంలో బాగా పండిన అరటిపండు గుజ్జును రాయాలి. 15 నిమిషాల పాటు అలాగే ఉంచి ఆ తరువాత పాదాలను శుభ్రం చేసుకోవాలి. అవకాడో ఫ్రూట్ సగభాగం, పచ్చికొబ్బరిని కలిపి జార్ లో వేసి మొత్తగా చేయాలి. ఆ తరువాత అరటిపండు గుజ్జును కలిపి మర్దన చేయాలి ఇలా చేయడం వల్ల పాదాల పగుళ్లు నివారించబడుతాయి.
ఇవే కాకుండా మరో చిట్కాను కూడా పాటించవచ్చు. ఒక క్యాండిల్ ను తీసుకొని దానిని ముక్కులుగా చేయాలి. అందులో ఉన్న దారాన్ని తీసివేయాలి. ఈ ముక్కలను ఆవనూనెలో వేసి వేడి చేయాలి. ఆ తరువాత కాళ్లను వేడి నీళ్లలో ఉంచి శుభ్రం చేయాలి. శుభ్రమైన పాదాలపై క్యాండిల్ మిశ్రమాన్ని రాయాలి. రాత్రి పడుకునే ముందు దీనిని రాసి కాళ్లకు సాక్సులు వేసుకోవాలి. ఇలా వారం రోజుల పాటు చేయడం వల్ల పాదాలు ఎంతో అందంగా తయారవుతాయి.